Everlasting truth
నిత్యం జరిగే సత్యం
{ మనిషి మనుగడ }
కొన్ని కోట్ల జీవకణాలు ఎంతో కష్టపడి పయనిస్తే, అందులో ఒక్కటంటే ఒక్కటే నిట్టూరంగా, ఎన్నో ఒడిదుడుకులను దాటి లోపలకి ప్రవేశిస్తుంది. కొన్ని నెలల తరబడి ఆ ఇరుకైన నరకంలో ఒదిగి;
అటు ఊపిరాడక, తిండిలేక, నీరులేక, జాగలేక, 'ఎందుకురా వచ్చాము?' అని అనిపించేదాకా ఎంతో ఓపికపట్టి, బాధనంతా ఓర్చుకొని చివరికి "అమ్మ" మనల్ని నవమాసాలు మోసి మనకు జీవం పోస్తుంది.
అప్పుడే ఊపిరి, చేతులు బిగపట్టుకొని మరీ, ఈ పాడు సమాజం లోకి ఇంకొక పాడు జీవంలా అవతరిస్తాం. ఆ క్షణం నుండి మనం కాలి బూడిదయ్యేవరకి, మన జీవనటనతో ఈ సమాజంలో మెల్లగా-మెల్లగా మెలుగుతాము. అంతలో, అందరిమందిలో అన్నీ తెలిసినవాడికి, అన్ని అనుభవాలు ఉండేవానికి తెలిసేవి ఈ పంచ సత్యాలే... ఈ పచ్చి నిజాలే.
1. "మనది మనం చూసుకోవాలి"
ఇతరులని నమ్ముకొని ఉంటే మన బతుకు బిచ్చపు గతైది.
2. పుట్టేటప్పుడు అమ్మను బాధ పెడతాం. జీవించేటప్పుడు మనతో ఉన్నవారందరిని బాధ పెడతాం. చచ్చేటప్పుడు నిజాయితీగా మన మేలు కోరే ప్రతీ మనిషిని బాధ పెట్టి వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు నయా పైసా తీసుకరాం. పొయ్యేటప్పుడూ నయా పైసా తీసుకుపోం. ఉన్నంతలో ఎందరికి మేలుచేస్తే, ఎందరికి ఉపయోగపడితే, ఎందరిని సంతోషంగా ఉంచితే, ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని త్యాగాలు చేస్తే, ఎందరి మనసులని దోచుకుంటే అనే తదితర వస్తువులనే పొయ్యేటప్పుడు తీసుకపోతం. అంతే తప్ప వీటికి వ్యతిరేకమైనవి ఎన్నటికీ మనకి మేలుని చేకూర్చేవి కావు.
మనుషులు ఎలా అంటే, పుట్టేటప్పుడు పట్టించుకుంటారు. జీవించి ఉండేటప్పుడు పట్టించుకోరు. చనిపోయేటప్పుడు పట్టించుకుంటారు.
చివరికి చనిపోయాక మళ్ళీ గదే పరిస్థితి.(పట్టించుకోకపోవటం). అందుకే," ఈ ప్రపంచంలో కొందరికే హృదయమున్నది. వారికొరకే ఈ లోకమున్నది. "
3. ఎవరి జీవితం వారిదే, ఎవరి జీవనాలు వారివే...
ఎవరి తెలివితేటలు వారికే, ఎవరి జ్ఞానం వారికే...
ఎవరి డబ్బులు వారివే, ఎవరి స్వార్థం వారికే...
ఎవరి బాధలు వారికే, ఎవరి కష్టాలు వారివే...
ఎవరి సంతోషాలు వారివే, ఎవరి కన్నీళ్లు వారికే...
ఎవరి సుఖాలు వారివే, ఎవరి దుఃఖాలు వారివే...
ఎవరి లాభాలు వారికే, ఎవరి నష్టాలు వారికే...
ఎవరు సేవ చేస్తరో వారే చేస్తరు, ఎవరు కీడు తలపెడ్తరో, మళ్ళీ అంటుకునేది వారి తలకే ...
ఎవరు గొయ్యి తవ్వుతరో, వారే పడ్తరు...
ఎవరి పనితనం వారిదే, ఎవరి అనుభవాలు వారికే...
ఎవరి ఆలోచనలు వారివే, ఎవరి ఉనుకులు వారికే...
ఎవరి గతం వారిదే, ఎవరి భవిష్యత్తు వారికే...
అయినా ఎంతని చెప్తాం, ఏమని చెప్తాం...
ఎంతని చేస్తాం, ఏమని చేస్తాం...
ఎవరి పుట్టుక వారిదే, ఎవరి చావు వారికే...
{ ఇదే సత్యం }
4. ఎంత అందంగా ఉన్నా, సచ్చినంక అయ్యేది బూడిదే!
ఎంత విలువైన బట్టలు తొడిగినా, చావుల కప్పేది చీపైన తెల్ల బట్టలే!
ఎంత విశాలమైన-ఖరీదైన బండ్లలో, కార్లలో తిరిగినా, చివరికి తిరిగాల్సింది ఒక ఇరుకైన చీపైన పెట్టలనే!
ఎంత పెద్ద ఇళ్లున్నా, ఆకరికి మన సొంత ఇళ్ళు అయ్యేది సమాదే!
ఎంత మంది మనతో కలిసి ఉన్నా, పుట్టేటప్పుడైనా,
సచ్చేటప్పుడైనా,
చివరికి, మిగిలాల్సింది, ఉండాల్సింది,
"మనమొక్కరమే"
5. జీవసమాజంను పట్టించుకునే స్తోమత లేకపాయే
మనది మనం పొందు పరుచుకోవాలన్నా సరైన తెలివి లేకపాయే
నలుగురితో కలిసి సంతోషంగా జీవించాలన్నా, మన మనసొప్పదాయె!
డబ్బులు రాగానే మనది మనం చూసుకొని, మిగితాది ఏమైనా ఉంటే వేరేవారికి చూద్దాంలే
అని అనుకునే లోపే ఇలా డబ్బొచ్చే, అలా అనుకున్నవన్నీ ఇట్టే గాల్లో కలిసిపోయే
ఇంకా కావాలే, ఇంకా కావాలే అనే దురాశలు రెట్టింపాయే రెట్టింపాయే
పరుల నాశనం కోరుకునే ఆలోచనలు ఇంకా మూడింతలాయే మూడింతలాయే!
జీవసమాజం బాగుకోరాలనే సాహసాలు అలా మటుమాయమైపాయె!
దగ్గరికొచ్చి సహాయం అడిగినవారికి, సహాయం చేయడం లాంటి విన్యాసాలు మనకొద్దాయే
ధనం, సంతోషం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం... ఇలా ఏమొచ్చిన అన్నీ కడుపులోనే దాచుకోవాల్నాయె, బయటికి అసల్కే కక్కరాదాయె!
ఎలా చావబోతున్నాం అని అనడం మానేసి, అసల్ ఎందుకు పుట్టాం అని అనడం మన బుర్రలో అలా నాటుకపాయే
ఎందుకు పుట్టాం అని తెల్వకపాయే. ఎందుకు చస్తున్నాం అని తెలుసుకునే లోపల మనిషి సచ్చేపాయే!
మనిషి సచ్చేపాయే, లోకంలో తన వెంట ఉన్నవారందరిని సంపి పైకి పారేపాయే!
భూమికి, ఆ మనిషిని చూసి బరువనిపించేలోగా, దానికి భారం దిగేపాయే...!
ఇంకొక నిజజీవైనా పుట్టడా? అనే ఆలోచన మళ్ళీ భూమికి మొదలైపాయే
అయినా, జీవితంలో ప్రతి మలుపు ఎవరికెరుకాయే?
ఇదింతే అని అందరూ ముక్కున వేలేసుకొని, ఎవరి పనుల్లో వారు మునిగేపాయే
ఇగ ఈ సమాజం ఇలా నాశనానికి ప్రతినిధి అయెపాయే
{ ఇదంతా నా చేత్తో రాసే నా కర్మగాలిపాయే...
జీవితం బుగ్గిపాలైపాయే...! }
ఇట్లు,
మీ శ్రేయోభిలాషి,
సాయి ✍🏻
Comments
Post a Comment