ఆశలు మిగిలే చోట

 

రసూల్ - రసూల్...






ఒకసారి, అనుకోని పరిస్థితుల్లో చాలా దగ్గరి వాళ్ళు అనారోగ్య బారిన పడడం వల్ల హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము. అక్కడే డాక్టర్ల సూచన మేరకు 4-5 రోజులు వరకు observation లోనే ఉంచడం జరిగింది. అక్కడ, ఎవరైనా ఒకరు ఇద్దరు నైట్ కూడా ఉండడం తప్పనిసరి. నేను ఉండాల్సి ఒచ్చింది! ఎందుకంటే డాక్టర్, నర్సులు... పేషెంట్కి ఎప్పుడు ఏం అవసరం ఒచ్చిన అందుబాటులో ఉండడానికి. మాతో పాటే రసూల్ అనే పేషెంట్ ని అడ్మిట్ చేసారు. అతని భార్య పేరు కూడా రసూలే! వాళ్ళ ఊరు నందిమేడారం అంటా! అయితే, రసూల్ అనే వ్యక్తికి హాస్పిటల్ లో జాయిన్ చెయ్యక ముందు, ఒక రెండు రోజుల ముందునుండి ఉన్నపలంగా తిన్నది తిన్న విధంగానే వాంతి చేసుకోవడం మొదలుపెట్టాడు.

     అస్సలు ఏ ఆహారం తీసుకున్న శరీరం దాన్ని అనుమతించట్లే. ఏమైందో ఏమో అని తన భార్య... "రసూల్" ని ఈ హాస్పిటల్ లో అడ్మిట్ చేయించింది. దురదృష్టం ఏంటంటే వారికి పిల్లలు లేకపోవడం. వారుంటే ఒక అండలా నిలిచేవాళ్ళు. ఆపదిలో వారిద్దరిని ఆదుకోవడానికి వారి చుట్టాలు కూడా ఎవ్వరు రాలేకపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి అన్నం ఉండేది కాదంటా సరిగ్గా. బియ్యం కొందామంటే చేతిలో డబ్బులు లేవు. రసూల్ ఆరోగ్యం కొంత బాగున్నప్పుడు పెళ్లి లలో, తదితర ఫంక్షన్లలో బ్యాండ్ కొట్టే పని చేసేవాడు అంటా. ఆరోగ్యం క్షీణించేసరికి పనిని మానేయాల్సి ఒచ్చింది. భర్త ఆ పనిని మానేసేసరికి ఇల్లు గడవడం చాలా కష్టం అయ్యింది. తిను (భార్య) చేసేదేం లేక తనకి కూడా ఆరోగ్యం బాలేక పోయిన, కైకిలి పనికి వెళ్ళేది. ఒచ్చిన ఆ కొద్ది పైసలతోటి ఇంటిని నెట్టుకొచ్చేది.
             

  అలా చేస్తూ ఉండంగానే ఈమె ఆరోగ్యం కూడా చాలా వరకి దెబ్బతిన్నది. పని మానేసే దుస్థితికి ఒచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే రసూల్ కి ఇలా అవ్వడం ఇంకా వాళ్ళిద్దరిని బలహీనపరిచింది. ఇంతకుముందు కూడా రసూల్ కి గుండె ఆపరేషన్ అయ్యిందని అతని భార్య చెప్పింది. అప్పుడు చల్మెడ హాస్పిటల్ లో, ఇంక వేరే ప్రైవేట్ హాస్పిటల్ లో చూపిస్తే దాదాపు 4-5 లక్షల వరకు ఖర్చు అయ్యింది. అంత డబ్బుని కట్టడానికి, వాళ్ళకి ఉన్న ఓ కాస్తో కూస్తో ఉన్న భూమిని అమ్మాల్సి ఒచ్చింది. ఆ ఉన్న కాస్త ధైర్యాన్ని కోల్పోవాల్సి ఒచ్చింది. ఇప్పుడు అడ్మిట్ చేసిన హాస్పిటల్ లో కూడా మందులకని, స్కానింగ్లకని, స్టేయింగ్ ఛార్జ్లకని అడ్డగోలుగా హాస్పిటల్ మానేజ్మెంట్ వాళ్ళు బిల్లులు వేస్తూనే ఒచ్చారు...

         మొత్తం ఒక 4 రోజుల వరకి ఉంటే హాస్పిటల్ లో ఉంటే, జాయిన్ చేసిన రోజే మొత్తం 50 వేల దాక ఖర్చు అయ్యాయి. ముందు రెండు రోజులకి అయ్యే ఖర్చులన్నిటిని ఊర్లో అక్కడిక్కడ తెల్సిన వాళ్ళని అడుక్కుంటూ జమ చేసి హాస్పిటల్ లో కట్టడానికి తెచ్చింది, కట్టింది. తర్వాత రెండు రోజులకి విపరీతమైన బిల్లులు వేసేసరికి చేతిలో ఉన్న ఆ కాస్త డబ్బులు కూడా అయిపోయాయి. మళ్ళీ భర్తకి చెప్పి, నేను ఊరికి వెళ్ళొస్తా అని వెళ్ళి... మళ్ళీ డబ్బులని అడగడం మొదలుపెట్టింది... ఈసారి డబ్బులు ఎవ్వరు ఇవ్వలేదు. చివరికి ఏం చేసేది లేక, దొరికిన వాళ్ళ... కాళ్ళో మీదో పట్టుకొని డబ్బులని అడిగింది. ఎంతో కొంత సర్ద గలిగింది. ఆ డబ్బులని తెచ్చి మళ్ళీ మిగితా రెండు రోజులకి కట్టుకుంటూ ఒచ్చింది. మా అన్నయ్యకు తెలిసిన డాక్టర్ కాబట్టి మాకు హాస్పిటల్ లోనే స్టే చెయ్యడానికి ఒక రూమ్ ఏర్పాటు చేసారు. పాపం, ఆమెకి ఒక రూమ్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది. గత్యంత్రం లేక ఆపరేటివ్ వార్డ్ రూమ్ ముందు నేల మీదనే పడుకోడానికి చూసింది.

             

మనుషులకి ఎలాగో మానవత్వం లేదు కాబట్టి, ఆమెని అక్కడ కూడా పడుకోనివ్వలేదు. అక్కడ నుండి వెళ్ళగొట్టారు. చేతిలో ఒక చిన్న సంచిని పట్టుకొని ఆమె తన భర్త కోసం రాత్రింపగల్లు అటూ ఇటూ ఎంత అలసట ఒచ్చినా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంది. రోజూ, నాలుగు డోసుల చొప్పున ఒక పేషెంట్ కి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిసారి ఒక్కో టర్మ్ కి ఒక్కో ప్రెస్క్రిప్షన్ ఇస్తారు. ఇచ్చిన ప్రతిసారి వెయ్యికి పైన బిల్లు అవుద్ది. మళ్ళీ మేము ఉండేది 4 వ ఫ్లోర్. లిఫ్ట్ ఉంది, కాని ఆమెకి దానిని ఎలా వాడాడమో తెలీదు. మెట్లు ఎక్కడం దిగడమే ఎంచుకునేది. నేను, ఇంకెవరైనా లిఫ్ట్ ని వాడేటప్పుడు ఆమెని కూడా రమ్మనేది. కొంచమైనా తీరిక పడుతుందేమో అని. ఆమె తన భర్త కోసం పడే కష్టాన్ని, అందులో ఉన్న ఆవేదనని చూస్తుంటే కంట్లో తెలీకుండానే నీళ్లు తిరిగేవి. సమయం ఉన్నప్పుడల్లా నేను ఆమె దగ్గరకి వెళ్లడం, తనకెంతో కొంత ధైర్యం చెప్పడం, నాకు వీలైనంత సహాయం చేయడం... ఇలానే ఒక మూడు రోజులు గడుస్తూ వచ్చాయి. మూడో రోజు సాయంత్రం వేళ అనుకుంటా, ఆమెతో నేను మాట్లాడుతున్నపుడు, నాతో ఇలా అందీ...




"ఇగ నాతోని అవ్వట్లే నానా...! మా ఆయనని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్న అస్సలు. ఈ డాక్టర్లు, నర్సులు పెట్టే నరకాన్ని మా ఆయన ఎలా తట్టుకుంటున్నాడో ఏమో! ఈ జీవితం మాకెందుకని అనిపిస్తుంది. ఇవన్నీ పాట్లు పడే బదలు... ఒకేసారి చనిపోయినా బాగుంటది! ఇంత వేదనని అనుభవించే బదలు ఆ పనే నయం! అతను చనిపోయాక... నేను కూడా ఏదో రోజు చనిపోతాను నానా... అవ్వట్లే నానా ఇగ మాతోని..." అని ఏడ్చుకుంటూ తాను దాచుకున్న దుఃఖాన్ని అంతా బయట పెట్టింది.

        ఆ మాటలని తన దగ్గరనుండి విన్నాక, నోటి నుండి నాకు మాటలు రాలేవు. కంట్లో కనీళ్ళు మాత్రం బయటికొచ్చాయి.


(గమనిక: నాలుగు రోజుల పాటు ఎంతో కొంత ట్రీట్మెంట్ ఇప్పించి, ఇగ లాభం ఏం లేదని, రసూల్ ని డిశ్చార్జ్ చేయించేసారు)

ఇగ అనిపించింది... నేను పెద్దయి, వాళ్ళు అప్పటికి బ్రతికే ఉంటే (బ్రతికే ఉండాలి కూడా)... నూటికి నూరు పాళ్ళు... ఉంటే ఇద్దరిని, లేకపోతే ఆ అమ్మని నేను మనస్ఫూర్తిగా ఆదుకొని, దగ్గరికి తీసుకుంటానని, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, నెలకి వాళ్ళు కడుపునిండా అన్నం తినేలా, ఉన్నవాటితో సంతోషంగా బ్రతికేలా నేను చూసుకుంటానని నాకు నేను మాట ఇచ్చుకుంటున్నాను.




నేను ఎప్పుడు ఒక మాట అంటుండే వాడిని:

"మాటని నిలబెట్టుకోలేమని తెలిసినప్పుడు, దానిని ఇవ్వకుండా ఉండడం కూడా తెలిసుండాలే!



ఈ మాట ఇచ్చి ఖచ్చితంగా నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తా!

ఇంకో మాట... ఇప్పుడు వారిద్దరికున్న బాధల్లో దాదాపు 10% శాతం కూడా మనకు ఉండకపోవచ్చు. మీరు అనొచ్చు... ఎవరి బాధలు వారికి ఎక్కువని. ఒక్కసారి వీరిద్దరిని తలుచుకోండి, ఆ తర్వాత క్షణమే అన్నీ మర్చిపోయి మీ పని మీరు చూసుకుంటారు.

ఇప్పుడున్న సమాజంలో, ఏ చిన్న బాధ ఒచ్చినా ఏకంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు! బ్రతికి ఏం సాధించలేము అని చనిపోతున్నారు. వాళ్ళకి తెలీంది ఏంటంటే, చచ్చి కూడా ఏం సాధించలేరు. పరిస్థితుల్లో నుండి తప్పించుకోవడం, నా అనుకునేవారిని బాధ పెట్టి వెళ్లడం తప్పా!

                                                                        - మీ సాయి ✍🏻




For the special readers: 🫠👇🏻

Go through the below given link... 👇🏻

                                           




Comments

Popular Posts