So, it's just happened!
అలా....జరిగిపోయింది ఇగ!
ఈరోజు, 06/11/2020, శుక్రవారం.
అలా సాయంత్రం, ఏదో చిన్న పని మీద పడి నేను ఆదర్శ బుక్ డిపో, యావర్ రోడ్డు పై అలా పక్కకి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాను. అలా మెల్లగా బాలాజీ టాకీస్ ఉండే చోటుకి వెళ్తుండగా ఇంతలో ఓ పెద్ద కారు
(టొయోట/ఇన్నోవా), పయనించే మా అందరి వెనకనుండి అలా దూసుకొచ్చి, అలా ఏమ్ సిగ్నల్స్ ఇవ్వకుండా, ఏమ్ ఇండికేటర్స్ వేయకుండా, కారుని మేమందరం వెళ్తుండగానే రోడ్డు మధ్యలో నుంచి పక్కకి మలిపేసారు. ఇదేంటి ఇలా మలిపారు, ఎవరబ్బా? అని అనుకునేలోపే, పక్కకి ఒకోన్ని ఈడ నేను వెళ్తుండుంగానే ఒకేటేసారి చెప్పకుండా చేయకుండా డ్రైవ్ చేస్తుండగానే కారుని పక్కకి ఆపారు. ఆ కారు వెనకాల నేను, మరియు నాతో పయణిస్తున్నవారు వారి-వారి వాహనాలకు ఓ గట్టి బ్రేక్ ని అందించారు. అందరూ అలా ఒక్కసారిగా ముందుకు బోల్తాకొట్టినంత పనైంది.
ఇదంతా కొన్ని మిల్లీ సెకండ్లలో జరుగుతుండంగానే ఆ పెద్ద కారునుండి ఎవరో ఒక పెద్ద మనిషి తెల్ల షర్ట్ -తెల్ల ప్యాంటు వేసుకొని కార్ డోర్ తీసి బయటికొస్తున్నాడు. అతనితో పాటు తోడుగా, కాపలా మరో ఇద్దరుమనుషులు దిగారు. అందులో ఒకరు ఆ పెద్ద మనిషి సెక్యూరిటీ గార్డ్ మరొకరు అతని సహచరుడు అనుకుంటా ! ముగ్గురికి ముగ్గురు కట్టకట్టుకొని కార్లోనుండి దిగారు. ఆ పెద్ద మనిషిని స్పష్టంగా చూడగానే అర్థమైపోయింది :-
* అతను ఎవరో కాదు, మా జగిత్యాల జిల్లా నియోజకవర్గ ఎం.ఎల్.సి అని. అతని పార్టీ కాంగ్రెస్ అని.
* అంతకు ముందు మా నియోజకవర్గానికే ఎం.ఎల్.ఏ గా సేవలందించాడని.
* ఈసారి కూడ ఎం.ఎల్.ఏ పదవికి నామినేషన్స్ వేసి ఓడిపోయి, కాంగ్రెస్ ఎం.ఎల్.సి గా గెలిచాడని.
అయితే, ఆ కార్ డ్రైవర్ పక్కకి ఆపిన చోట, అక్కడ, అటుపక్క పోయేందుకు ఓ సంధి ఉంది. అయితే, ఈ ఎం.ఎల్.సి { జీవన్ రెడ్డి } ఆ సంధిలోకే పరుగులెత్తాడు. నేను ఏమైందో అని నా సైకిల్ ని కూడ పక్కకు తిప్పుకున్నాను. చివరికి, ఆ సంధిలోకి చూసేసరికి, ఒక ఇంటి ముందర ఎందుకో టెంట్ వేసున్నది. అక్కడనే మరికొందరు పెద్ద మనుషులు కూడ నిల్చొని దేని గూర్చో మాట్లాడుతున్నారు. ఈ జీవన్ రెడ్డి గారు కూడ ఆ స్థలానికి చేరుకొని అక్కడి ఉన్నవారితో కలిసిపోయారు. నేను ఏమ్ జరిగుంటుందో తెలుసుకుందామని, ఆ సంధిలోకి వెళ్తే తెలుసుకోవచ్చు కదా అని వెళ్ళా ! ఉన్నట్టుండి ఏమైందో గాని అలా మూడడుగులు వేసేసరికే ఎందుకో వారుండే చోటుకి వెళ్ళబుద్ధికాలేదు. అంత పెద్దోల్లు ఉండే చోటుకి, పోరాగాన్ని నేను పోయి ఏమ్ చేయాలని, మళ్ళీ వెనక్కే మర్లినా ! మళ్ళీ నా సైకిల్ నేన్ అందుకొని బయల్దేరా !
కాని, అక్కడ ఏమైఉంటుందో అని తెలుసుకోలేకపోయా ! రోడ్డు మీద అలా వెళ్తుండగా, ఇలా ఓ ఆలోచన నా మెదడులో మెలగడం మొదలైంది. అదేంటంటే, " అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైతే మాత్రం అంతలా, అందరూ పయనించే రోడ్డు పైనుండి ట్రాఫిక్ రూల్స్ ని అధిగమించి కారుని పక్కకి అలా తిప్పుతారా అని?
అయినా, అవన్నీ అనుకుంటే ఏమ్ లాభం లే? వాళ్ళు ఎంతైనా పెద్దోల్లు, మనం మాములు మనుషులం. అంతేగా? ! కాని, ఎందుకో వారు అలా చేయడం, నేను ఈ విధంగా ఆలోచించడం, ఎందుకో ఇదంతా నా మనసుకి నచ్చలేదు ! అందుకోసమే, నేను నా చిన్నప్పటినుండి సమాజమన్నా, సమాజం లోనున్న మనుషులన్నా అయిష్టాన్నే పెంచుకున్నానే తప్ప ఇష్టాన్ని ఎప్పుడు పెంచుకోలేదు ! పెంచుకోను కూడ !!
{ నేను... నా అంతే...? ! }
[ దీన్ని మీరు స్వార్థం అని అనుకుంటారేమో ! నేనైతే ఇతరి జీవితాల్లో మనమెందుకు వట్టిగా వేలుపెట్టుకోవడం అని అనుకుంటా !!
ఏదైతేనేం ! నేనేమన్నా తప్పుగా (లేదా) మీ మనసుని నొప్పించేలా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి! ]
ఇట్లు,
మీ శ్రేయోభిలాషి,
సాయి ✍️.
Comments
Post a Comment